Monthly Archives: June 2012

గురువులు తరువులై గరిమగ మన వలె

పల్లవి.
గురువులు తరువులై గరిమగ మన వలె,
బరువులై అందరిపై భువిన ఒఱుగ రాదు. ||గురువులు||

అనుపల్లవి.
నిరత సన్మార్గ శాంతి శుభ దాతలై,
దారిని జూపెడి దీప్తులై యుండ వలె. ||గురువులు||

గురుకర్తవ్యం:
1.
ప్రేమ, భక్తి, కరుణ, ప్రతి ఎదన నింపుచూ,
తామసము తొలగించు తత్వ బోధకులై,
కామ, క్రోధ, మోహ, కలుషములు తొలగించి,
నెమ్మిగ అందరికి నీతిని నేర్ప వలె. ||గురువులు||

2.
ఆసూయ, ద్వేషముల రూపును మాపి,
ఆశ యను రక్కసిని అంతము చేయ వలె,
మోస రాజకీయ సర్ప కోరలు తీసి,
దేశ భక్తిని ప్రతి గుండెన నింప వలె. ||గురువులు||

3.
జాగ్రుతి భావ శంఖమును పూరించి,
జగతి ప్రగతికి తమ చేయూత నీయ వలె,
రాగానురాగ మధు రసము త్రాగించి,
పగల మంటల నార్పు పెను మబ్బు కావలె. ||గురువులు||

4.
అర్ధ వ్యామోహ ఆతృతలు తగ్గించి,
స్వార్ధ బుద్ధిని వీడి సేవలు చేయ వలె,
అర్ధము లేని అహంకారము వీడి, పర
మార్ధ సాధనకు బావుటా నెత్త వలె. ` `||గురువులు||

గురు వర్తన:
5.
అహంకారముతో హంకరించుట మాని,
స్నేహ భావామృత చలివేంద్ర కావలె,
దేహ సుఖములకు దాసోహ మనక,
మోహము విడనాడి మనిషిగ నుండ వలె. ` `||గురువులు||

6.
పదవి, ప్రఖ్యాతుల పాకులాటలు మాని,
గద్దెపై కోర్కెను గుండెలో చంప వలె,
గతములో చేసిన తప్పులు దిద్దికోని,
పెద్దలపై గౌరవము పెంచుకొని మన వలె . ` `||గురువులు||

7.
విద్యలు ఉన్న వని విఱ్ఱ వీగి పోక,
హద్దులు ఎఱిగి వర్తన చేయ వలె ,
చేదు విషమును చిమ్ము చపలత్వము వీడి,
నిద్రను మేల్కొని నల్గురుని దిద్ద వలె. ` `||గురువులు||

8.
ఉరుములా ఉరుముచు ఉద్వేగము పడక,
చిరు నవ్వు చిందించు సద్బుద్ధి చూప వలె,
కరుణ, శాంతి, ప్రేమ ధర్మ గుణ మణిగ ,
గురువు ఒక ఆదర్శ వ్యక్తిగ నుండ వలె. `||గురువులు||

9.
ఙ్ఞాన ఫలముల నిచ్చు కల్ప వృక్షములా,
తన శిష్య కోటితో ఆచార్యుడుండ వలె,
సాన బట్టిన తన సద్గుణ దీప్తులతో ,
సన్మార్గ గామిగ గురువులు మన వలె. ` `||గురువులు||

10.
నీచ భావ నీచు వదనలమని చెప్పక,
ఆచరణతో తాను అందరికి చూప వలె,
త్రాచుల వంటి తన ఆరు గుణములు వీడి,
స్వఛ్చమగు ముత్యమై ఆచార్యు డుండవలె. `||గురువులు||

11.
గురువులకు గురువైన తిరుమలేశుని రూపై,
గురువు అతి ఘనమగు ఘన కీర్తి నొందవలె,
ఉర్విలో గురువులు ఉత్తము పురుషులై,
సర్వ జీవులకు శాంతిని పంచ వలె. ||గురువులు||

గరుభక్తి ఫలము:
12.
తల్లి, తండ్రి, గురువు తత్వ సమానులు,
ఇలపైన ఉన్న ప్రత్యక్ష దేవతలు, వారి
కాలి ధూళి ఒక్కింత సోకిన,
కలి కాల మందలి కలుషములు తీరు. ||గురువులు||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 30 జూన్ 2012

bavinpro haripadamu

పల్లవి.
భావింపరో హరి పదము,
సేవింప అందించు వరము. ||భావింపరో||

అనుపల్లవి.
క్షీరాబ్ధి సుందర రూపం,
దర్శించ యిదియే సమయం . ||భావింపరో||

1.
నీలాద్రి నిర్మల రూపం,
తొలగించు ఎద లోని శోకం,
అలమేలు నాధుని చరణం,
కొలచేటి వారిదే భాగ్యం. ||భావింపరో||

2.
శ్రీ చక్ర సుందర హస్తం,
యిచ్చేను నీకు అభయం,
మెచ్చేటి సులభ దైవం,
యిచ్చోటే ఉంది నిరతం. ||భావింపరో||

3.
కనుడోయి వజ్రకిరీటం,
కను గాంచ తొలగు దుఃఖం,
వినా వేంకటేశ నామం ,
విన దక్క దెచట మోక్షం. ||భావింపరో||

4.
యిది యిచ్చును వైభోగం,
మదికిచ్చు నిజమైన సౌఖ్యం,
పదిలముగ కైవల్య భాగ్యం,
నీదే గోరుము శరణం. ||భావింపరో||

రమాకాంతరావు చాకలకొండ మంగళవారం, 19 జూన్ 2012

Pitru devo bhava

పిత్రు దేవోభవ, పితరుల పండుగ రోజు -తండ్రి ధర్మము?

పల్లవి.
తండ్రి, బిడ్డల మధ్య తియ్యని ప్రేమే,
గుండెలో నింపెడి ఘను డగును తండ్రి! ||తండ్రి||

అనుపల్లవి.
తల్లి, దండ్రుల ఋణము తీర్చ లేమని ఎఱిగి,
పిల్లలు వర్తించ ప్రియ మొందు తండ్రి. ||తండ్రి||

1.
తండ్రి సన్మార్గుడై, తన ధర్మ మెఱిగి,
నిండు హృదయముతో బిడ్డలను పెంచి,
మెండు భావ పూర్ణ మార్గ దర్శకుడై,
అండ దండగ ఉండు ఆప్తుడే తండ్రి. ||తండ్రి||

2.
విఙ్ఞాన ఖనిగ, విద్యల నిధిగ,
సన్మార్గ గామిగ, సహృదయ వ్యక్తిగ,
మన్ననలు పొందుచూ, మంచి మార్గము లోన,
తనయులను నడిపించు, తండ్రియే తండ్రి. ||తండ్రి||

3.
బాల్య మందు బిడ్డ మంచి చెడ్డలు జూచి,
వలపుతో పిలిచెడి వ్యక్తియే తండ్రి! కొమ
రుల వయసుతో, మిత్రుడిగ, మంత్రిగ,
మెలగు నేరే గదా అసలైన తండ్రి! ||తండ్రి||

4.
పుత్ర వాత్సల్యముతో, పద్ధతిగ పెంచి
సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మార్గము జూపి,
నిత్యము నీడల, బిడ్డలను కాపాడు,
ఉత్తమ పురుషుడే ఉర్విలో తండ్రి! ||తండ్రి||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 17 జూన్ 2012 10:03:39 పూర్వాహ్న