Monthly Archives: May 2012

Tallini Minchina

పల్లవి.
తల్లిని మించిన దైవము ఏవరు?
తల్చగ భువిలో తెల్లముగ! ||తల్లి||

అనుపల్లవి.
ఎల్ల లోకములు ఏలెడి వాడే,
తల్లి ఘనతను చాటెనుగ. ||తల్లి||

1.
రాముడు జనని కౌసల్యమ్మ,
ప్రేమామృతము పొందెనుగ,
శ్యాముడు యిద్దరి తల్లుల బిడ్డై,
అమ్మ ప్రేమను బడసెనుగ. ||తల్లి||

2.
శ్రీనివాసుడు వకుళాదేవి,
కన్న బిడ్డగ మెలిగెనుగ ,
ఎన్ని కీర్తనలు వ్రాసి పొగడిన,
అన్ని తల్లికి తక్కువెగ. ||తల్లి||

3.
భువిన దేముడు తనకు మారుగ ,
దేవి అమ్మను పంపెనుగ,
నవ మాసములు మోసిన తల్లికి,
నవనము చేసి కొల్తురుగ . ||తల్లి||

4.
అల్లిన కవితలు ఆరాధనతో ,
చల్లని తల్లికి అర్పణగ,
మల్లెల వన్నెల మమతల వల్లిని,
ఉల్లము భక్తిగ పొగడెనుగ . ||తల్లి||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, మే , 12 2012

Tallini Minchina