Monthly Archives: April 2012

Dedicated to All Mothers

పల్లవి.
జన్మ నిచ్చిన తల్లి కమ్మని గర్భముకు,
అనురాగ, అభిమాన అభినందనం. ||జన్మ||

అనుపల్లవి.
ప్రాణ మిచ్చిన తల్లి పావన వక్షముకు,
మన్ననల తోటి హరి చందనం. ||జన్మ||

1.
ముద్దు పెట్టిన తల్లి మాధుర్య అధరముకు,
ఎదలోన భక్తిగ ఆభివందనం,
ముద్దులతో ముద్దలు నోటి కందించిన,
మాధుర్య హస్తముకు హరి చందనం. ||జన్మ||

2.
ఎత్తు కొని తిప్పిన అందాల కరములకు,
చేతులెత్తి చేయు ఆభివందనం ,
చదువులు, బుద్దులు చక్కగ గరిపిన,
మాత్రు మూర్తికి ప్రేమ హరి చందనం. ||జన్మ||

3.
నడక నేర్పను, బుడత తడబడగ పట్టుకొను ,
పడతి మృదు హస్తముకు అభివందనం,
నడకతో పాటుగ నడతను నేర్పిన, పూ
బోడి పావనికి హరి చందనం . ||జన్మ||

4.
ఉగ్గు పోయను కాస్త బుగ్గ గిల్లిన తల్లి,
నిగ్గైన వేలుకు అభివందనం,
మగ్గి పోకుండ మల, మూత్రములు తుడుచు,
సుగాత్రి సేవలకు హరి చందనం. ||జన్మ||

5.
ప్రేమాను రాగములు కలబోసి పెంచిన,
అమ్మ పాదములకు అభివందనం.
ఇమ్ముగ భువిలోన నెమ్మిని జూపిన,
కమ్మని అమ్మకు హరి చందంనం. ||జన్మ||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 22 ఏప్రిల్ 2012

A song in Honor of Sri ALN Murthy

A song in Honor of Sri ALN Murthy:

పల్లవి.
మానవ సేవయే మాధవ సేవని,
అనిశము భావించు అమృత మూర్తి. ||మానవ||

అనుపల్లవి.
ఆశయ సిద్ధికై ఆరాట పడువాడు,
నిస్వార్ధ స్ఫూర్తి గల నరసింహమూర్తి. ||మానవ||

1.
సత్యవతి నోముల పంటగ పుట్టి,
తాత, తండ్రుల తనరు పేరు నిలబెట్టి,
అతిశయము జూపక, అందరితో మెలిగెడి,
నిత్య కృషీవలుడు నరసింహ మూర్తి. ||మానవ||

2.
విశాఖ జిల్లా నిర్మాణ సమితితో,
దేశ సేవ చేయ ఆశయము చేబూని,
లేశమైన తన స్వార్ధము చూపక,
శోషితుల సేవించు నరసింహ మూర్తి. ||మానవ||

3.
సమాజ సేవకై సతతము కృషిచేయ,
గ్రామ సిరి సంస్థకు ప్రాణము పోసి,
గ్రామసిరే తన సిరిగ గట్టిగ భావించు,
ప్రేమ స్వరూపుడు నరసింహ మూర్తి. ||మానవ||

4.
విద్య, వైద్య, విత్త, వ్యవసాయ రంగముల,
చిత్త శుద్ధి తోటి చెలగి సేవ చేసి,
ఆత్మ నివేదనతో అన్ని సాధించిన,
మధుర మృదు హృదయుడు నరసింహమూర్తి. ||మానవ||

5.
మదిలోన నమ్మిన మహనీయ భావములు,
సాధనతో సాధించి సాకారము చేసి.
మేదిన అందరిలో మంచి వాడు యన్న,
ఖ్యాతి గొన్న ఘనుడు నరసింహమూర్తి. ||మానవ||

6.
ఉగ్ర నరశింహుని పేరున్నగాని,
నిగ్రహము గల్గిన నిర్మల హృదయుడు,
సగుణ, సహృదయ సంపన్న శీలురలో,
అగ్ర గణ్యుడు మన నరశింహమూర్తి. ||మానవ||

7.
పిల్ల పాపలతోటి పది దశాబ్దములు
అలరు ఆరోగ్యము, ఐస్వర్యము కల్గ, సప్త
శైలపతి దీవేనలు చేగొని,
వెలుగు బాటన సాగు నరసింహమూర్తి. ||మానవ||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 21 ఏప్రిల్ 2012

Manava

Vachindi Vartha

పల్లవి.
వచ్చింది వార్త, వీనులకు విందుగ,
తెచ్చింది శుభ లేఖ తిలకించ ముందుగ. ||వచ్చింది||

అనుపల్లవి.
మధురా పురి దివ్య మందిరాహ్వానముతో,
మధురమై హృదయము ఊగిస లోందగ. ||వచ్చింది||

1.
కోకిల రవముతో మన కార్య దర్శిని,
చక్కని యీ వార్త చాటి చెప్పగ మనకు,
ఎక్కడ లేని ఆనంద కెరటములు,
గ్రక్కున ఎగసే హృదయాబ్ధి లోన. ||వచ్చింది||

2.
మధుర మకరందమగు గీత నిచ్చిన ఘనుడు,
మధుర పురీశుడు మన ఊరికి రాగ,
ఎదలోన తియ్యని భావ లహరి పొంగి,
మధుర గీతములా వెలువడె చక్కగ. ||వచ్చింది||

3.
ప్రతి దినము పండువుగ పూష్ప పూజలతో,
అతి దివ్య భక్తితో అందరము కలసి,
రతి నాధు జనకుని రమ్యమగు రీతిలో,
నిత్యము సేవింప తరుణము వచ్చెగ. ||వచ్చింది||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 15 ఏప్రిల్ 2012 10:15:12 పూర్వాహ్న

Sleeping Beauty

పల్లవి.
ఎల్ల లోకములు చల్లగ నేలెడి, ఏడు కొండల వాడ జోజో!
కొల్లలుగ సంపదలు కుమ్మరించెడి వాడ! గోకుల గోవింద జోజో!! ||ఎల్ల||

అనుపల్లవి.
వేదముల ఊయలలో డోలికలు ఊగెడి, వేంకటాద్రివాస జోజో!
నాద బ్రహ్మలు పాడు లాలి పాటలతో, నిదురించు వాడా జోజో! ||ఎల్ల||

1.
కౌసల్య ఒడిలోన కమ్మగ శయనించు, కోదండ రామయ్య జోజో!
ఆశలు తీర్చెడి అరవింద దళ నయన, ఆది నారాయణా జోజో! ||ఎల్ల||

2.
యశోదమ్మ కొట్టు చిచ్చితో నిదురించు, యదుకుల భూషణా జోజో!
యశము, ఆయువు, సిరులు అందించు వాడ! అమృత హృదయ జోజో!. ||ఎల్ల||

3.
అడుతూ పాడుతూ అలసి పోయిన వాడ, అలనాటి వామన జోజో!
అడుగడుగు దండాలు అందుకొను వాడా! అలరు శ్రీగిరవాస జోజో! ||ఎల్ల||

4.
పాల కడలి పాము పాన్పుపై పవళించు, పద్మావతి రమణ జోజో!
అలమేలు కౌగిలిలో ఆదమరచక మమ్ము, అలరించు దేముడా జోజో! ||ఎల్ల||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 07 ఏప్రిల్ 2012

YellaLokamulu

Save Environment Save Yourself

పల్లవి.
మండు టెండల మధ్య మల్లెల సోన,
మండించి, గుండెలు పిండెడి వాన. || మండు||

అనుపల్లవి.
నింపె ఆనందము యీ చెంప పైన
తృంపె ఆశలు యటు ఆ ఎద లోన. || మండు||

1.
కాల చక్రము తో ఋతు గతులు మారి,
కాలుష్య సర్ప ద్రష్టమై సృష్టి,
కిల కిలలు నింపగ కాంచు చిన్నలకు,
కాల నాగై వాన కన్నీరు నింపెగ. || మండు||

2.
ఆడు బాలురకు ఆనంద మిచ్చినవి
జడి వాన జల్లులు మల్లెలై యీవైపు.
వడగండ్ల తెచ్చినవి విపరీత మావైపు,
కడ గండ్లు నింపినవి కానగ ఆవైపు. || మండు||

3.
భూమిని చక్కగ కాపాడు కొన్నచో,
ఏమి విపరీతములు ఎన్నడు కలుగవు,
కమ్మని ఫలములు, నీడ నిచ్చే చెట్లే!
సొమ్మని భావించి స్నేహముగ పెంచుడో! || మండు||

4.
నీటి కాలుష్యము, నింగి కాలుష్యము,
ఏటిలో, కడలిలో ఎగసె కాలుష్యము,
వాడ వాడన విన శబ్ద కాలుష్యము,
వీటికి మూలము హృదయ కాలుష్యము. || మండు||

5.
వ్యర్ధ పదార్ధములు ఒలికి కాలుష్యము,
భూరి పరిశ్రమల బొగ్గు కాలుష్యము,
తెరలు, తెరలుగు అణు, కాంతి కాలుష్యము,
స్వార్ధమే దీనికి శోచింప మూలము. || మండు||

6.
కాలుష్య సింహము కోరల పడకుండు,
ఎల్లరు తమవంతు కృషి చేయ వలెను,
చల్లని భూమాత చెఱగు చెదర కుండ,
మల్లెల సృష్టిని కాపాడ వలెను! || మండు||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 07 ఏప్రిల్ 2012

Mandutendala