పప్పు –మహత్యం

పల్లవి. అప్పడం, అన్నము, పప్పు , నెయ్యి కలిపిన,
చెప్పలేని పని గదా చేతికి నోటికి. ||ముద్ద||

అనుపల్లవి. దప్పళం, వడియము, దప్పముగ కలసిన, (దప్పముగ = దట్టముగ, బాగుగ)
దబ దబ దబాయించ దివ్యము నోటికి. ||ముద్ద||

1. ముద్ద, ముద్ద చేతిలో ముద్దుగ కలుపుచూ,
వద్దు, వద్దు అనకుండ ఆవు నేయి అలముచూ, (అలముచూ = పూయుచూ)
దప్పికైన యించుక లెక్కచేయకుండిన,
జొప్పిం వచ్చులే యింక రెండు ముద్దలు. ||ముద్ద||

2. దోసకాయ, పాలకూర, చింత చిగురు పప్పులు,
ఆశ తీర్చు మామిడి టమాటో పప్పులు,
మోసులెత్తు మానసం, ముద్ద ముద్ద మెచ్చగా,
రాసిగ కలపరా రాసమే నీటికి. (రాసము = రసము, సల్లాపము) ||ముద్ద||

3. ఆవకాయ, మాగాయ, టమాటో పచ్చడి,
చేవగ కలిపిన చిత్రమెగా పప్పుతో,
బ్రేవుమని ప్రేవుల ఆరాటము తీర్చుచూ,
ఆవురావురు యనగ అందించు నోటికి. ||ముద్ద||

4. పప్పు తోటే భీముడు కొట్టాడు విజయము,
పప్పు తినే దమయంతి నచ్చిందట నలుని,
పప్పు యిచ్చు తెలివితో వచ్చులే కవితలు,
పప్పంటే అప్పడిగి అగు నెంతో యిష్టము. (అప్పడు = వేంకటేశుడు) ||ముద్ద||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 31 అక్టోబర్ 2013

Download (PDF, 48KB)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha Captcha Reload